హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ గర్ల్స్‌ హాస్టల్‌ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. హాస్టల్‌లో భద్రతా లోపాలు ఉన్నాయని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సెక్యూరిటీ పెంచాలని
విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్‌ కాలేజీ అమ్మాయిల వసతి గృహంలో ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత
హాస్టల్లోకి ప్రవేశించి ఓ అమ్మాయిని భయభ్రాంతులకు గురిచేశాడు. చంపేస్తానంటూ కత్తితో బెదిరించి అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు, గదుల్లోని మిగతా అమ్మాయిలు గట్టిగా అరవడంతో
పారిపోయాడు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.బాధితురాలు.. ఓయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని. హాస్టల్లోని ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉంటోంది.
పోలీసులు, అధికారులు, విద్యార్థుల వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3:10 గంటలకు నిద్రలేచిన బాధితురాలు వాష్‌రూమ్‌కు వెళ్లింది. అదే సమయంలో హాస్టల్‌ వెనుకవైపు ఉన్న గోడను దూకి
దుండగుడు లోపలికి వచ్చాడు. బాత్‌రూంలోకి ఆమె వెళ్లడం చూసి బయట నుంచి గడియపెట్టాడు. కొద్దిసేపటికి లోపలి నుంచి డోర్‌ను ఆమె తెరించేందుకు ప్రయత్నించగా రాలేదు.ఆందోళన చెందిన
ఆమె.. డోర్‌ను గట్టిగా కొట్టడంతో దుండగుడు.. బాత్‌రూం గోడపైకి ఎక్కాడు. అరిస్తే చంపేస్తానంటూ ఆమెను కత్తితో బెదిరించాడు. తర్వాత బాత్‌రూమ్‌ లోపలకు వంగి డోర్‌ గడియతీసి ఆమెను బయటకు
లాక్కొచ్చాడు. బాధితురాలి అరుపులకు నిద్రిస్తున్న అమ్మాయిలు లేవడంతో వారి గదులకు బయట నుంచి గడియ పెట్టాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధితురాలు గట్టిగా
కేకలు వేయడం.. గదుల్లోని అమ్మాయిలు కూడా పెద్దగా అరవడంతో దుండగుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.