రహస్యంగా, బుల్లి తెరలమీద చూసే, నీలి చిత్రాలను వెండి తెరమీద పబ్లిక్గా చూపిద్దామనుకున్నారో ఏమో!   బిగ్ బాస్ పుణ్యమా అని అందరికీ పరిచయమయ్యిన భానుశ్రీ, అభిషేక్ పచ్చిపాల ముఖ్య పాత్రలలో నటించిన  పచ్చి బూతు చిత్రం ఈ ఎడుచేపల కథ.

నేను శంకరాభరణం తీయలేదుకాని ఇది బూతు చిత్రం కాదంటూ ధైర్యంగా,  అందరికీ అబద్ధం చెప్పగలిగే దమ్మున్న ఎస్ జె చైతన్య దర్శకత్వం వహించగా, చరిత సినిమా ఆర్ట్స్ పతాకంపై డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జివిఎన్ నిర్మించారు. ఒక వేళ ఇది బూతు చిత్రం కాకపోతే ఇంక బూతు చిత్రమని దేనిని అంటారో!

ఈ అడల్ట్ కామెడీ ట్రైలర్‌ను బాయ్ ఫ్రెండ్‌తోనో.. గర్ల్ ఫ్రెండ్‌తోనో కలిసి మాత్రమే చూడాలని ఓ ఉచిత సలహా కూడా పారేస్తున్నారు చిత్ర యూనిట్. నెలకోసారి బ్లడ్ ఎక్కించుకోకపోతేనే  చచ్చిపోయే హీరో, ఆ రక్తం కోసం ఎడుగురు అమ్మాయిలతో జరిపే రాసలీలలే ఈ సినిమా.  XX సర్టిఫికేట్ కి  మాత్రమే అర్హమైన ఈ సినిమాని జనాలమీదికి వదలబోతున్నారు దర్శక, నిర్మాతలు. ఒకవేళ ప్రేక్షకుల ఖర్మకాలి ఈ చిత్రం కాని కొంచం ఆడిందంటే, మున్ముందు ఏలాంటి సినిమాలు వస్తాయో తలుచుకుంటేనే వాళ్ళు జాలదిరిస్తోంది.