న్యూఢిల్లీ: చైనా, భారత సరిహద్దు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(FDI) లకు ఇకపై ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరిగా  తీసుకోవాలి. ఇందుకోసం ఎఫ్‌డీఐ నిబంధనలను సవరించినట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక డిపార్ట్‌మెంట్‌ (డీపీఐఐటీ) ప్రకటించింది. ప్రస్తుత లేదా భవిష్యత్‌ ఎఫ్‌డీఐలకు సంబంధించి దేశీయ కంపెనీల యాజమాన్య హక్కుల బదిలీకి సైతం ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరని డీపీఐఐటీ స్పష్టం చేసింది. కరోనా సంక్షోభంలో దేశీయ కంపెనీలు కొట్టుమిట్టాడుతున్నాయి. వ్యాపారాల లాక్‌డౌన్‌తో ఆదాయం లేక దివాలా తీసే పరిస్థితిలో ఉన్నాయి. ఇదే అదనుగా చైనా దేశ కంపెనీలు మన సంస్థలను బలవంతంగా టేకోవర్‌ చేయకుండా రక్షించడానికి  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చై నాతో పాటు బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, భూటాన్‌, నేపాల్‌, మ యన్మార్‌, ఆఫ్ఘనిస్థాన్‌ దేశాలు భారత్‌తో సరిహద్దులు పంచుకుంటున్నాయి.  ఇప్పటివరకు పాకిస్తాన్‌ నుంచి వచ్చే ఎఫ్‌డీఐలకు మా త్రమే ఈ ఆంక్షలుండేవి. పాక్‌కు చెందిన వ్యక్తి లేదా కంపెనీ భారత్‌లో కొన్ని రంగాల్లో మాత్రం ప్రభుత్వ అనుమతితో పెట్టుబడులు పెట్టేందుకు వీలుంటుంది.