న్యూఢిల్లీ : దేశమంతా లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వపు హోమ్ శాఖ అదనపు కార్యదర్శి గోవింద మోహన్ మార్గ దర్శకాలు విడుదల చేశారు. కరోనా ప్రభావం అంతగాలేని ప్రాంతాల్లో, ఈనెల 20వ తేదీ నుంచి అమలయ్యేలా పలు మినహాయింపులు ఇచ్చింది. లాక్‌డౌన్‌ మే 3వ తేదీ వరకు అమలవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవన్నీ ఈనెల 20వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. అదికూడా... రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ‘కంటైన్‌మెంట్‌ జోన్‌’లుగా ప్రకటించని ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. మినహాయింపులకు లోబడి పని చేసే వారు సైతం భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలను రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలు ఎంతమాత్రం నీరుగార్చరాదని ఆదేశించింది.  


గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలను ఏప్రిల్‌ 20 నుంచి తెరుచుకోవచ్చు. అందులోనూ కార్మికులు భౌతిక దూరం పాటించాలి. సెజ్‌లు, ఎగుమతి ప్రధాన కేంద్రాలు, పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక టౌన్‌షి్‌పలలోని కర్మాగారాలన్నీ తెరుచుకోవచ్చు. అదికూడా... పూర్తిస్థాయి రక్షణ చర్యలతో మాత్రమే! స్వయం ఉపాధికి సంబంధించి ఎలక్ట్రీషియన్లు, కంప్యూటర్‌ రిపేర్లు, ప్లంబర్లు, మోటార్‌ మెకానిక్‌లు, కార్పెంటర్లు తమ తమ పనులు చేసుకోవచ్చు. 

హైవేలపై ధాబాలు తెరుచుకోవచ్చు. 

గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణపు పనులు , సాగునీటి ప్రాజెక్టుల పనులు కొనసాగించవచ్చు.

సరుకుల దుకాణాలు, పండ్లు, కూరగాయల దుకాణాలు/బండ్లు, పాల బూత్‌లు, చికెన్‌, మటన్‌, చేపల దుకాణాలు తెరుచుకోవచ్చు. నిత్యావసరాలతోపాటు అన్ని రకాల ‘గూడ్స్‌’ రవాణాకు ఇబ్బంది ఉండదు. 

ఐటీ, ఐటీ అనుబంధ  రంగాల సేవలకు సంబంధించిన కార్యకలాపాలను గరిష్ఠంగా 50 శాతం సిబ్బందితో నిర్వహించవచ్చు. ప్రభుత్వానికి సేవలు అందించే డేటా, కాల్‌ సెంటర్లకు మినహాయింపు.  ఈ-కామర్స్‌ కంపెనీలు, వాటి వాహనాలను తగిన అనుమతులు తీసుకుని నడపవచ్చు. 

దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చే వారంతా మాస్క్‌లు ధరించాల్సిందే. ఇందులో మినహాయింపు లేదు. పనిచేసేందుకు అనుమతించిన ప్రాంతాల్లోనూ మాస్కులు, శానిటైజర్‌ల వినియోగించాలి. థర్మల్‌ స్ర్కీనింగ్‌ యంత్రాలు తప్పనిసరి. 

దేశవ్యాప్తంగా బహిరంగంగా ఉమ్మివేయడంపై కేంద్రం నిషేధం విధించింది. దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ర్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే ఆయా రాష్ట్రాలు జరిమానా విధించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే దీనిపై నిషేధం విధించారు.

గుట్కా, పాన్‌ మసాలాలు, నమిలే పొగాకు, సిగరెట్ల అమ్మకాలను మే 3వ తేదీ వరకు పూర్తిస్థాయిలో నిషేధం అమలవుతుంది.

ఆయుష్‌, ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్‌లు, క్లినిక్‌లు, టెలీమెడిసిన్‌ కేంద్రాలు, డిస్పెన్సరీలు, కెమిస్టులు, ఫార్మసీలు, అన్ని రకాల వైద్య ఉపకరణాల షాపులు తెరిచే ఉంటాయి. అంబులెన్స్‌లు, మెడికల్‌ షాపులు, వైద్య ఉపకరణాలు, అంబులెన్స్‌ల తయారీ, వైద్యరంగానికి సంబంధించిన నిర్మాణ కార్యకలాపాలకు చేసుకోవచ్చు. 

హాట్‌స్పాట్ ప్రదేశాలలో  కఠిన నిబంధనలు 

‘కరోనా’ హాట్‌స్పాట్‌గా ప్రకటించిన జిల్లాల్లో కఠినమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.  దేశంలో కరోనా హాట్‌ స్పాట్స్‌ సహా కొవిడ్‌-19 కేంద్రాలు, కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రం లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయనున్నారు.  లాక్‌డౌన్‌ సడలింపు నిబంధనలు ఉల్లంఘిస్తే అక్కడ తక్షణమే తిరిగి లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేయాలి.


దేశీయ, అంతర్జాతీయ విమానాలన్నీ బంద్‌.  రైళ్లు, మెట్రో, ప్రజారవాణాకు సంబంధించిన బస్సులు  తిరగవు.  ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప... ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఎవ్వరూ ప్రయాణించేందుకు అనుమతించరు. ట్యాక్సీలు, క్యాబ్‌లు, ఆటోలు తిప్పడానికి వీల్లేదు. సొంత కార్లలోనూ డ్రైవర్‌కాకుండా మరొక్కరు మాత్రమే వెనుక సీటులో కూర్చోవాలి. బైక్‌లపై ఒక్కరే వెళ్లాలి.

వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన అన్ని పనులకు ఎటువంటి ఇబ్బందీ లేదు.