హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్ మే 7 వరకు వుంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.  తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో లాక్‌డౌన్ సడలింపులు ఉండవని సీఎం అన్నారు. కేబినెట్‌లో చర్చించిన అనంతరం ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఏప్రిల్ 20 తర్వాత కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ సడలింపులు ఉంటాయని కేంద్రం ప్రకటించింది. అయితే, రాష్ట్రాల్లో పరిస్థితిని బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపుపై నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసిందని సీఎం చెప్పారు. ఎటువంటి మినహాయింపులు లేకుండా లాక్‌డౌన్ విషయంలో గతంలో ఉన్న నిబంధనలే మే 7వరకూ కొనసాగుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. . తెలంగాణలో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ లాక్‌డౌన్ పొడిగింపుపై సర్వే చేశామని, పలు మీడియా సంస్థలు కూడా సర్వే చేశాయని సీఎం చెప్పారు. అభిప్రాయ సేకరణ అనంతరం కేబినెట్‌లో చర్చించాక మే 7వరకూ తెలంగాణలో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.నిత్యావసరాలు ఎప్పటిలానే అందుబాటులో ఉంటాయని ప్రజలుకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.