విజయవాడ: ఎస్‌ఈసీ కనగరాజ్‌ రిటైర్డ్‌ జడ్జియేనా అని  అనుమానం వస్తోందని  మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు.  అధికారమదంతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. విశాఖలో కరోనా వివరాలను దాస్తున్నారని ప్రచారం జరుగుతోందని చెప్పారు. భవిష్యత్‌ పరిణామాలు లెక్క చేయకుండా తాను అనుకున్నదే జరగాలన్న అహంతో సీఎం జగన్ ఉన్నారని సబ్బం హరి తప్పుబట్టారు. శాసనమండలి, రమేష్‌కుమార్‌ విషయంలో అన్యాయం జరిగిందని, కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారని చెప్పారు. జమిలి ఎన్నికలు వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది కానీ.. ఎన్నికలు రాకుంటే మరో నాలుగేళ్లు ఎలా ఉంటుందో ఊహించలేమని ఆందోళన వ్యక్తం చేశారు. రమేష్‌కుమార్‌ విషయంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదని ఆయన హెచ్చరించారు.