న్యూఢిల్లీ: తమ ఖాతాదారుల వ్యాలిడిటీ గడువును పొడిగిస్తూ రిలయన్స్ జియో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ తమ ఖాతాదారుల వ్యాలిడిటీ గడువును మే 5 వరకు పొడిగిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది.  ఇప్పుడు జియో కూడా అదే బాటలో నడిచింది. వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కూడా లో-ఇన్‌కమ్ ఖాతాదారుల వ్యాలిడిటీని పొడిగించాయి. లాక్‌డౌన్ అమల్లో ఉన్నంత కాలం తమ ఖాతాదారులు ఇన్‌కమింగ్ కాల్స్ అందుకోవచ్చని ఈ సందర్భంగా జియో వివరించింది. ఈ అవకాశం కొంతమందికే కాదని, జియో ఖాతాదారులందరికీ ఇది వర్తిస్తుందని తెలిపింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లు మాత్రం తక్కువ ఆదాయ వనరు కలిగిన ఖాతాదారులకు మాత్రమే ఈ అవకాశం కల్పించాయి. అయితే, ఇన్‌కమింగ్ కాల్స్ వ్యాలిడిటీ ఎప్పుటి వరకన్న విషయాన్ని మాత్రం జియో వెల్లడించలేదు. అయితే, లాక్‌డౌన్ గడువు ముగిసే వరకు ఈ వ్యాలిడిటీ ఉంటుందని భావిస్తున్నారు.