హైదరాబాద్: విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. రానున్న విద్యా సంవత్సరంలో ఫీజులు పెంచరాదని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు మంత్రి సబిత ఆదేశాలు జారీ చేశారు. యాజమాన్యాలు మానవతా దృక్పథంతో ఆలోచించి నెలవారీ ఫీజులు తీసుకునే ఏర్పాట్లు చేయాలని ఆమె తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పాఠశాల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. ఫీజుల రూపంలోనే కాకుండా మరే విధంగా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసినా చర్యలు తీసుకుంటామని చెప్పారు.  6 నుంచి పదో తరగతి వరకు టీ సాట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తామని  మంత్రి సబిత పేర్కొన్నారు. మంగళవారం నుంచి పాఠాలు మొదలవుతాయని మంత్రి తెలిపారు.