నిజామాబాద్: బోధన్ ఎమ్మెల్యే షకీల్‌కు సంబంధించి ఓ ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఆడియోలో ఎమ్మెల్యే షకీల్.. పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు ఉంది. లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలోనే ఏసీపీ జైపాల్ రెడ్డి, టౌన్ సీఐ రాకేష్ గౌడ్‌తో సహా ఎస్ఐల తీరుపై ఎమ్మెల్యే షకీల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ ఓ వర్గాన్ని మాత్రమే పోలీసులు టార్గెట్ చేసుకుని కొడుతున్నారని షకీల్ ఆ ఆడియోలో ఆరోపించారు. ఈ విషయమై సీపీతో పాటు అధికారులందరికీ ఫిర్యాదు చేసినా తీరు మారడం లేదని పోలీసులపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలని, సముదాయిస్తూ చెప్పండని పోలీసు అధికారులకు షకీల్ హితవుచెప్పారు. ఇలాగే వ్యవహరిస్తే పోలీసులపై ప్రజలు తిరగబడతారని ఎమ్మెల్యే వారిని హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరికకు సంబంధించి ఆడియోను గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.