అమరావతి:మే 29  వ తారీఖున  ఆంధ్రప్రదేశ్ హై కోర్టు జగన్మోహన రెడ్డి ప్రభుత్వం  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కాల పరిమితిని  తగ్గించడం ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఎలెక్షన్ కమిషనర్ గా  తొలగిస్తూ ఇచ్చిన  ఆర్డినెన్సు కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ జె కె మహేశ్వరి, సీనియర్ జడ్జ్ సత్యనారాయణ మూర్తిలతో కూడిన హై కోర్టు బెంచ్ ఈ   ఆర్డినెన్సు కొట్టివేసి  రమేష్ కుమార్  ని మళ్ళీ స్టేట్ ఎలెక్షన్ కమిషనర్ గా నియమంచాలని చెప్పింది. హై కోర్టు జడ్జ్మెంట్  వచ్చిన వెంటనే, తాను ఎస్ఈ సీగా తిరిగి పదవీ బాధ్యతలు చేపట్టానని రమేష్ కుమార్ అన్నారు. ఎటువంటి పక్షపాతం లేకుండా ఇంతకు ముందు లాగానే విధులు నిర్వర్తిస్తానని కూడా ప్రకటనలో తెలియచేసారు. సాధారణ స్థితి నెలకొన్న వెంటనే ఆపివేసిన స్థానిక ఎన్నికలను తిరిగి నిర్వహిస్తామని అన్నారు. వ్యక్తులు శాశ్వతం కాదని, రాజ్యాంగ సంస్థలు మాత్రమే  శాశ్వతమని ఆయన అన్నారు. 

ఏప్రిల్ 10 వ తారీఖున ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్  చట్టానికి సవరణలు చేస్తూ ఎస్ఈసీ  కాల పరిమితిని 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు ప్రభుత్వం తగ్గించింది. ప్రభుత్వ అధికారులు కాకుండా హై కోర్టు జడ్జ్ స్థాయి అధికారిని రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించేటట్టు మార్పు చేసింది. ఆర్డినెన్సు  జారీ చేసిన గంటల్లో హై కోర్టు రిటైర్డ్ జస్టిస్ వి కనగరాజ్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా చార్జి తీసుకున్నారు. అంత హడావిడిగా చార్జి తీసుకున్న ఆయన పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్ధకంగా  తయారయ్యింది.

 తెలుగు దేశానికి చెందిన వర్ల  రామయ్య, బిజేపి కి చెందిన కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి వాడ వడ్డే శోభనాదీశ్వరరావు మొదలైన వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తొలగించటాన్ని సవాల్ చేస్తూ హై కోర్టులో పిటిషన్ లు వేశారు.  సుదీర్ఘ వాద, ప్రతివాదాలు జరిగిన తరువాత హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సు కొట్టి వేసింది. ఆర్టికల్ 213 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి ఆర్డినెన్సు జారీ చేసే అధికారం లేదని హై కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. 

మార్చ్  15 వ తారీఖున, కరోనా వైరస్ వలన స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తూ నిమ్మ గడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన దూరం అయ్యారు. ఆయనను తీవ్రంగా విమర్శించిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఆర్డినెన్సు ద్వారా ఆయనను పదవి నుంచి తొలిగించింది. ఆయన చంద్ర బాబు నాయుడు కులం అయినందువల్లే  తెలుగుదేశం పార్టీకి  మేలు చేయటానికి నిమ్మ గడ్డ రమేష్ కుమార్ ప్రయత్నిస్తున్నారని  వైసీపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఆ తరువాత తనకు తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని, తనకు రక్షణ కావాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. 

ఆ లేఖ ఫోర్జరీ అని,టిడిపి నాయకులు ఆ లేఖను సృష్టించారని విజయ సాయి రెడ్డి  ఫిర్యాదు చేయడంతో  విచారణ కూడా జరుగుతోంది . విచిత్రం ఏమిటంటే ఆ లేఖ నేనే రాశానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పిన తరువాత కూడా ఇంకా విచారిస్తూనే ఉన్నారు. హై కోర్టు తీర్పు వచ్చిన తరువాత  రమేష్ కుమార్ తిరిగి వీధుల్లో చెరినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం  సర్క్యులర్   317/SECA/2020  ద్వారా మే 29 న తెలియచేసింది. అంతకన్నా వేగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జి వాణీమోహన్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త సెక్రేటరీగా నియమించింది. శనివారం రాత్రి అంతకు ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి విధుల్లోకి చెరినట్టు విడుదల చేసిన సర్క్యులర్ ఉప సంహరించారు. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విషయమై అడ్వకేట్ జెనరల్   ఎస్ శ్రీరామ్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన స్పందిస్తూ రమేష్ కుమార్ తానే తిరిగి ఎన్నికల కమిషనర్ అని స్వయంగా ప్రకటించుకున్నారని అన్నారు. హై కోర్టు అటువంటి ఆర్డర్ ఏమి ఇవ్వలేదని అన్నారు. తాము హై కోర్టు ఆర్డర్ మీద స్టే కోరామని ఆయన అన్నారు. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం హై కోర్టు ఆర్డర్ ప్రకారం నడుచుకోలేదని అన్నారు. న్యాయం  కోసం మళ్ళీ  హై కోర్టు కి వెళతానని , ప్రభుత్వం మీద కోర్టు ధిక్కరణ కేసు వేస్తానని కూడా ఆయన అన్నారు. హై కోర్టు ఆర్డర్ పారాగ్రాఫ్ 308 ప్రకారం  స్టేట్ ఎలెక్షన్ కమిషనర్ గా 31 మార్చ్ 2021, న పదవి కాలం ముగిసే వరకు తనని తిరిగి నియమించమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. జస్టిస్ కనగరాజ్ నియామాకం చెల్లదని కూడా ఆయన అన్నారు.  హై కోర్టు ఉత్తర్వులు అమలు పరిచే ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అర్ధమవుతోందని ఆయన అన్నారు.

హై కోర్టు తీర్పు వచ్చిన వెంటనే అనేక మంది YCP నాయకులు, కార్యకర్తలు హై కోర్టును కూడా వదల కుండా అసభ్య పదజాలంతో దూషించారు. దాంతో హై కోర్టు 93 మందికి నోటీసులు జారీ చేసింది. తానే సోషల్ మీడియా కు పెద్ద నని,   నోటీసులు అందుకున్న వారంతా  వీర సైనికులని, వారిని కాపాడు కుంటామని  విజయ సాయి రెడ్డి గారు అనటం కొస మెరుపు. ప్రభుత్వం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య నడుస్తున్న ఈ యుద్ధం ఎక్కడి దాకా వెళుతుందో, సుప్రీం కోర్టు ఏమి అంటుందో ఆయన తిరిగి తన పదవిలో కూర్చుంటారో లేదో  చూద్దాం!